🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 September 2026, 8:42 pm Posted by : RK SAKSHI

*తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తిని కొనసాగిస్తాం.. *ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి*

News Image

సూర్యాపేట రూరల్:తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తిని కొనసాగిస్తాం ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. బుధవారం అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నపోరు వనితల స్ఫూర్తి యాత్ర సూర్యాపేట మండలం బాలెoలగ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం ప్రారంభమైన పోరాటం అనంతరం విస్తృత ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ‘దున్నేవాడికే భూమి’ అనే నినాదంతో మహత్తరమైన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిందని తెలిపారు.
ఈ పోరాటంలో వేలాది మంది ప్రజలు ప్రాణత్యాగం చేశారని, అనేక గ్రామాలను వెట్టిచాకిరీ నుంచి విముక్తి చేశారని, పోరాట ఫలితంగా లక్షలాది ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగిందని పేర్కొన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర అత్యంత కీలకమైనదని మల్లు లక్ష్మి అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు కూడా ధైర్యసాహసాలతో ఉద్యమంలో పాల్గొని త్యాగాలు చేశారని తెలిపారు. కుటుంబ సభ్యులు, భర్తలు, అన్నదమ్ములు ఉద్యమంలోకి వెళ్లిన సమయంలో కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే మహిళలు ఉద్యమానికి అండగా నిలిచారని గుర్తుచేశారు. మహిళలు దళాల్లో సభ్యులుగా, కొరియర్లుగా, దళ కమాండర్లుగా పనిచేస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని అన్నారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని ఆమె అన్నారు. సాధారణ మహిళగా ప్రారంభమైన ఐలమ్మ పోరాటం తెలంగాణ రైతాంగ ఉద్యమానికి గొప్ప ఊపునిచ్చిందన్నారు. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి వీర వనితలతో పాటు వేలాది మంది మహిళలు తమ శ్రమను, ధైర్యాన్ని, త్యాగాన్ని ఉద్యమానికి అందించారని చెప్పారు.వీర వనితల పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించడంతో పాటు, వారి త్యాగాలను స్మరించుకోవడమే వీర వనితల స్ఫూర్తి యాత్ర ప్రధాన ఉద్దేశమని అన్నారు. మహిళల త్యాగాలను, పోరాట వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, నేటి తరంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాట స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. అంతకుముందు మండల కేంద్రానికి విచ్చేసిన వీర వనితల స్ఫూర్తి యాత్ర బృందానికి పూలమాలవేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల స్మారక స్తూపానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణ జ్యోతి, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి బుగ్గవీటి సరళ, కే ఎన్ ఆశలత, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, సిఐటియు జిల్లా నాయకురాలు చెరుకు ఏకలక్ష్మి,ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు జూలకంటి విజయలక్ష్మి, మేకన బోయిన సైదమ్మ, సిఐటియు జిల్లా నాయకురాలు మేకన బోయిన శేఖర్, రైతు సంఘం జిల్లా నాయకులు దండా వెంకటరెడ్డి, మేరెడ్డి కృష్ణారెడ్డి, చిట్లంకి యాదగిరి, పందిరి సత్యనారాయణరెడ్డి, అప్పయ్య, చెరుకు సత్యం, నాగిరెడ్డి శేఖర్ రెడ్డి, రెడ్డి మోహన్ రెడ్డి, సానబోయిన ఉపేందర్, నల్ల మేకల అంజయ్య, గుండాల పుల్లయ్య, నారాయణ వీరారెడ్డి, నంద్యాల కేశవరెడ్డి, నోముల ధనమూర్తి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home