🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 20 September 2026, 10:42 am Posted by : M TODAY NEWS

బడి తెరిచే నాటికే యూనిఫాం, పుస్తకాలు!

News Image
ముఖ్యమైన పాయింట్స్:వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలిఅదనంగా 10 శాతం విద్యార్థుల చేరికను దృష్టిలో ఉంచుకోవాలివిద్యాశాఖ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్షనెలాఖరుకల్లా రెండో జత యూనిఫాం పంపిణీ
హైదరాబాద్:రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాం, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి అందేలా ఇప్పటినుంచే పక్కా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న యూనిఫాం, ఇతర వస్తువుల పంపిణీపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా మరో 10 శాతం విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున, ఆ పెరిగే సంఖ్యకు అనుగుణంగా ముందుస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

నెలాఖరుకు రెండో జత:

ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెలాఖరు నాటికి రెండో జత కూడా అందజేస్తామని తెలిపారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు ఇప్పటికే రెండు జతల యూనిఫాంల పంపిణీ పూర్తయినట్లు వెల్లడించారు. అలాగే, విద్యార్థులందరికీ నోటు పుస్తకాల పంపిణీ సైతం నూరు శాతం పూర్తయిందన్నారు.

హాస్టల్ విద్యార్థులకు సకల సౌకర్యాలు:

ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులకు అవసరమైన ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులతో పాటు కార్పెట్లు, బెడ్‌షీట్లు, టవళ్లు వంటి సదుపాయాల పంపిణీ కూడా పూర్తయిందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. కాగా, ఈ ఏడాది ప్రభుత్వం అందించిన యూనిఫాం, ఇతర వస్తువుల నాణ్యత అద్భుతంగా ఉందని, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పూర్తి సంతృప్తి వ్యక్తమవుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
🏠 Home