🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 20 September 2026, 3:26 pm Posted by : M TODAY NEWS

చెల్లెలి హత్యకు ప్రతీకారం.. పక్కా స్కెచ్‌తోనే హరిబాబు దారుణ హత్య

News Image
ముఖ్యమైన పాయింట్స్:నిజామాబాద్‌లో సంచలనం సృష్టించిన కేసు ఛేదనసోదరి వైష్ణవి మృతికి బదులు తీర్చుకునేందుకే దారుణంవిశాఖకు పారిపోతుండగా ప్రధాన నిందితుడు సంతోష్ అరెస్ట్కారు, మూడు కత్తులు స్వాధీనం.. వివరాలు వెల్లడించిన సీపీ సాయి చైతన్య
నిజామాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన హరిబాబు హత్య కేసును పోలీసులు కేవలం 36 గంటల్లోనే ఛేదించారు. సోదరి వైష్ణవి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకే ముందస్తు ప్రణాళికతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి, అతడి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, మరో రెండు కత్తులు, రెండు కర్రలతో పాటు ఓ తెలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మీడియాకు వెల్లడించారు.

తన సోదరి వైష్ణవి హత్యను మనసులో పెట్టుకున్న గంధం సంతోష్.. హరిబాబును అంతమొందించేందుకు పక్కా పథకం రచించాడు. ఇందుకు తల్లి గంధం రాణి, పెద్దమ్మ కుమారులు చరణ్, రంజిత్‌లతో పాటు ఇతర కుటుంబ సభ్యుల సహకారం తీసుకున్నాడు. ప్రణాళికలో భాగంగా ఈ నెల 17న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కోరుట్ల నుంచి తెలుపు రంగు స్విఫ్ట్ కారులో నిజామాబాద్‌కు చేరుకున్నారు. ఆర్.ఆర్.చౌరస్తా సమీపంలోని గిరిరాజ్ కాంప్లెక్స్ ఎదుట ఓ పానీపూరి బండి వద్ద హరిబాబు నీరు తాగుతుండగా నిందితులు గమనించారు. వెంటనే కారు కుడివైపు వెనుక డోర్ నుంచి కిందకు దిగిన సంతోష్.. కత్తితో హరిబాబు తల, ముఖం, మెడపై విచక్షణారహితంగా దాడి చేసి అదే కారులో పరారయ్యాడు. మృతుడి బంధువు చిత్తరి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజామాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్ 103(1) ఆర్/డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద క్రైం నంబర్ 169/2026 తో కేసు నమోదు చేశారు.

విశాఖకు పారిపోతుండగా పట్టివేత..

హత్య జరిగిన వెంటనే అప్రమత్తమైన సీపీ సాయి చైతన్య.. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడి కదలికలను గుర్తించారు. కారును ఒకచోట వదిలేసి, తన అత్తగారి ఊరైన విశాఖపట్నం పారిపోయేందుకు నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న సంతోష్‌ను ఔటర్ బైపాస్ వద్ద పోలీసులు గుర్తించారు. ఈ నెల 19న అతడిని పట్టుకునే క్రమంలో తప్పించుకునేందుకు యత్నించగా పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు.

మరో ముగ్గురి కోసం గాలింపు

ఈ హత్య కేసులో ప్రాథమికంగా నలుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, ప్రధాన నిందితుడు సంతోష్ మినహా మిగిలిన వారు పరారీలో ఉన్నారని సీపీ వెల్లడించారు. మిగతా నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. దర్యాప్తులో ఎవరి పాత్ర తేలినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హత్య జరిగిన ఒకటిన్నర రోజుల్లోనే కేసును ఛేదించిన ఏసీపీ ప్రకాష్, సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్‌ఐ యాదగిరి గౌడ్ తదితర సిబ్బందిని సీపీ అభినందించారు. నిందితులకు కోర్టులో కఠిన శిక్ష పడేలా పటిష్టమైన ఆధారాలు సేకరించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు.

🏠 Home