🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 20 September 2026, 6:45 pm Posted by : M TODAY NEWS

జగన్ గూటికి మళ్లీ షర్మిల?.. తెరవెనుక రాజీ ప్రయత్నాలు!

News Image
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకునే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాలవ్వగా, ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల సైతం ఆ పార్టీని గెలిపించుకోలేకపోయారు. అయితే, జగన్ ఓటమిలో షర్మిల పాత్ర ఉందన్నది రాజకీయ వర్గాల్లో బహిరంగ రహస్యమే. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న ఈ పోరులో అన్నాచెల్లెళ్లు ఇద్దరూ నష్టపోయారని, అంతిమంగా వారి ఉమ్మడి ప్రత్యర్థి లాభపడ్డారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వాస్తవాన్ని ఆలస్యంగా గ్రహించిన వైఎస్ కుటుంబం, ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.

జగన్, షర్మిల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వారి తల్లి వైఎస్ విజయమ్మతో పాటు కొందరు అత్యంత సన్నిహితులు, శ్రేయోభిలాషులు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. షర్మిలను తిరిగి వైసీపీలోకి ఆహ్వానించడం ద్వారా పార్టీకి పునర్జీవం పోయాలనేది ఈ మంత్రాంగం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసు విచారణల నేపథ్యంలో, భవిష్యత్తులో జగన్ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొని జైలుకు వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏమిటన్నదానిపై వైసీపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. గతంలో జగన్ లోపల ఉన్నప్పుడు పార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించిన షర్మిల అయితేనే, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని సమర్థవంతంగా కాపాడగలరని వైసీపీ కోటరీ భావిస్తున్నట్లు సమాచారం.

మారనున్న పార్టీ స్వరూపం.. విజయసాయి కొత్త కుంపటి?

తల్లీకూతుళ్లు మళ్లీ వైసీపీలో క్రియాశీలకంగా మారితే, పార్టీలో ప్రస్తుతం ఉన్న కోటరీ ప్రాబల్యం తగ్గి, అంతర్గత సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ పరిణామాలను పసిగట్టిన సీనియర్ నేత విజయసాయిరెడ్డి.. షర్మిల ఎంట్రీ ఇస్తే తనకు ప్రాధాన్యత దక్కదనే ఉద్దేశంతో కొత్త పార్టీని స్థాపించే యోచనలో ఉన్నారనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు, ఆస్తుల పంపకాలు, పార్టీలో ప్రాధాన్యతపై స్పష్టమైన హామీలు లభిస్తేనే షర్మిల తిరిగి అన్నతో చేయి కలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో పదేళ్లయినా భవిష్యత్తు లేకపోవడం కూడా షర్మిల రాజీకి సుముఖంగా ఉండటానికి ఒక కారణంగా కనిపిస్తోంది.

టీడీపీ వ్యూహాలకు చెక్ పెట్టేందుకేనా?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యుల మధ్య ఉన్న బలమైన బంధాన్ని, కూటమి పార్టీల మధ్య ఉన్న ఐక్యతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ అండదండలు కూడా మెండుగా ఉండటంతో కూటమి ప్రభుత్వం పటిష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో "సింగిల్ సింహం" తరహా రాజకీయాలు ఇకపై పనిచేయవని, ఉమ్మడి శత్రువును ఎదుర్కోవాలంటే పాత వ్యూహాలు మార్చుకోవాలని వైసీపీ మేధావులు జగన్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అందుకే కుటుంబ ఐక్యతను చాటుకోవడం ద్వారా ప్రజల్లో తిరిగి విశ్వాసం పొందేందుకు తల్లీచెల్లెళ్లను తిరిగి పార్టీలోకి తీసుకురావడమే ఏకైక మార్గంగా జగన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఈ రాజకీయ ఊహాగానాలు ఎంతవరకు నిజమనేది కాలమే నిర్ణయించాలి. అప్పటివరకు జగన్ వైసీపీ అధ్యక్షుడిగా, షర్మిల ఏపీ పీసీసీ చీఫ్‌గానే కొనసాగుతారు.

🏠 Home