🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 21 September 2026, 1:11 pm Posted by : M TODAY NEWS

రష్యా ఎన్నికల్లో మళ్లీ పుతిన్ హవా

News Image
ముఖ్యమైన పాయింట్స్:ఉక్రెయిన్ దాడుల మధ్యే పోలింగ్.. అధికార పార్టీకి భారీ ఆధిక్యం‘యునైటెడ్ రష్యా’కు 57.5% ఓట్లు.. వెనుకబడిన ప్రతిపక్షాలుమాస్కోపై డ్రోన్ దాడులు.. ఐదుగురు మృతి
ఉక్రెయిన్‌తో యుద్ధం ఐదో ఏడాదిలోకి ప్రవేశించిన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రాజకీయ పట్టును మరోసారి నిరూపించుకున్నారు. యుద్ధంపై ప్రజల మద్దతును పరీక్షించుకునేందుకు జరిగిన పార్లమెంటు (స్టేట్ డూమా) ఎన్నికల్లో ఆయనకు చెందిన అధికార ‘యునైటెడ్ రష్యా’ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రతిపక్షాలు చాలా వెనుకబడిపోవడంతో రష్యా రాజకీయాలపై పుతిన్ ఆధిపత్యం కొనసాగుతోందని తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

7.7 శాతం పెరిగిన ఓటు బ్యాంకు
సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు రష్యాలో ఎన్నికల పోలింగ్ జరిగింది. సెప్టెంబర్ 21 నాటికి వెలువడిన పాక్షిక ఫలితాల ప్రకారం.. 450 సభ్యులున్న డూమాలో మెజారిటీ సాధించే దిశగా అధికార ‘యునైటెడ్ రష్యా’ 57.5 శాతం ఓట్లతో ముందంజలో ఉంది. 2021 ఎన్నికల్లో ఆ పార్టీకి 49.82 శాతం ఓట్లు రాగా, తాజా ఎన్నికల్లో దాదాపు 7.7 శాతం మేర ఓటు బ్యాంకు పెరగడం గమనార్హం. ఇక ప్రాథమిక లెక్కల ప్రకారం ప్రతిపక్షాలైన కమ్యూనిస్ట్ పార్టీ 13.67 శాతం, ఎల్‌డీపీఆర్‌ 9.27 శాతం, న్యూ పీపుల్‌ 7.96 శాతం, జస్ట్‌ రష్యా 5.16 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నాయి. ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ పార్టీలు కూడా పార్లమెంటులో కొన్ని స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది.

ఎన్నికల వేళ ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
ఓ పక్క ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మాస్కోతో పాటు పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో మాస్కో ప్రాంతంలో ముగ్గురు, రష్యా ఆధీనంలోని ఖెర్సన్ ప్రాంతంలో మరో ఇద్దరు మరణించారు. మృతుల్లో ఒక ఎన్నికల అధికారి కూడా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకే ఉక్రెయిన్ ఈ దాడులకు తెగబడిందని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ఆరోపించారు. అయితే దాడుల వల్ల పోలింగ్‌కు ఎలాంటి ఆటంకం కలగలేదని ఆయన స్పష్టం చేశారు.

యుద్ధానికి మద్దతుగా పుతిన్ సర్కార్ ప్రచారం!
ఈ ఎన్నికల ఫలితాలను పుతిన్ ప్రభుత్వం తమ విధానాలకు, ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధానికి ప్రజల నుంచి లభిస్తున్న పూర్తిస్థాయి మద్దతుగా చూపే అవకాశం ఉంది. అయితే యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగుతున్న వేళ.. ప్రజల్లో నెలకొన్న ఆర్థిక ఆందోళనలు, ప్రతిపక్షాలకు లభిస్తున్న ఓటు బ్యాంకు రాబోయే రోజుల్లో రష్యా రాజకీయ పరిణామాలను ఏ మలుపు తిప్పుతాయనేది ఆసక్తికరంగా మారింది.
🏠 Home