🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 21 September 2026, 10:51 pm Posted by : M TODAY NEWS

రాయచోటి పట్టణ సమగ్రాభివృద్ధికి రూ.244.32 కోట్లు

News Image
రాయచోటి:
రాయచోటి పట్టణ రూపురేఖలు త్వరలో పూర్తిగా మారనున్నాయి. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలన్న రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ భారీగా నిధులు మంజూరు చేసింది. వివిధ పథకాల కింద ఏకంగా రూ.244.32 కోట్ల నిధులను కేటాయించినట్లు మంత్రి మండిపల్లి సోమవారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. సురక్షితమైన తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణ, నాణ్యమైన రహదారులు, పార్కులు, వీధి దీపాల కల్పనకు ఈ నిధులను వెచ్చించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
పట్టణంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. అమృత్ 2.0 పథకం కింద తాగునీటి సరఫరా, నీటి వనరుల పునరుద్ధరణ కోసం రూ.3.68 కోట్లతో పనులు జరుగుతుండగా, స్వచ్ఛ భారత్ మిషన్ (SBM 2.0) కింద ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ నిమిత్తం రూ.4.96 కోట్లతో పనులు చేపట్టారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రోడ్లు, డ్రైన్లు, పూడికతీత పనులకు మరో రూ.3.68 కోట్లు కేటాయించారు. ఈ మూడు విభాగాల్లో కలుపుకుని మొత్తం రూ.12.32 కోట్ల విలువైన పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
రాబోయే రోజుల్లో పట్టణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అదనంగా భారీ నిధులను సైతం మంజూరు చేసింది. ఇందులో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానం ద్వారా రోడ్లు, డివైడర్లు, పార్కులు, వీధి దీపాల ఏర్పాటుకు రూ.35 కోట్లు కేటాయించగా, ఈ పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి. అలాగే, అత్యంత ప్రాధాన్యత కలిగిన UIDF-IV పథకం కింద పట్టణంలో తాగునీటి సరఫరా, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధికి ఏకంగా రూ.197 కోట్లు కేటాయించారు. ఈ బృహత్తర ప్రాజెక్టు ప్రస్తుతం పాలనాపరమైన అనుమతుల దశలో ఉందని మంత్రి పేర్కొన్నారు.
రాయచోటి పట్టణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేస్తామని, వివిధ శాఖల సమన్వయంతో పనులను నిర్ణీత గడువులోగా, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అన్ని హంగులతో కూడిన సుందరమైన పట్టణంగా రాయచోటిని తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసిందని మంత్రి ఉద్ఘాటించారు.
🏠 Home