🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 22 September 2026, 7:19 pm Posted by : M TODAY NEWS

తోటి విద్యార్థుల ఎగతాళి.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!

News Image
ముఖ్యమైన పాయింట్స్:బుధరావుపేట మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఘటన - ఆస్పత్రిలో చికిత్స, పరిస్థితి నిలకడ - పర్యవేక్షణపై వెల్లువెత్తుతున్న విమర్శలు
నర్సంపేట : తోటి విద్యార్థులు ఎగతాళి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని హాస్టల్‌లోనే టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నర్సంపేట మండలంలో కలకలం రేపింది. బుధరావుపేట మోడల్ స్కూల్ హాస్టల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సిబ్బంది పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోంది.

నర్సంపేట పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని బుధరావుపేట మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. శనివారం ఆమె అనారోగ్యానికి గురికావడంతో హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి నర్సంపేటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించి, మందులు ఇప్పించి అదే రోజు సాయంత్రం తిరిగి హాస్టల్‌లో వదిలివెళ్లారు.
ఆదివారం రాత్రి భోజనం అనంతరం తోటి విద్యార్థులు ఆమెను ఎగతాళి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న టాబ్లెట్లను అధిక మోతాదులో మింగేసింది. కాసేపటికి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తోటి విద్యార్థులకు విషయం చెప్పింది. వారు వెంటనే వార్డెన్‌కు సమాచారం ఇవ్వడంతో ఆమెను హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

హాస్టల్ పర్యవేక్షణపై ప్రశ్నల వర్షం..
ఈ ఘటనతో హాస్టల్‌లో విద్యార్థుల భద్రత, మందుల నిర్వహణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్యంతో ఉన్న విద్యార్థులకు అవసరమైన మందులను సిబ్బంది తమ పర్యవేక్షణలో ఉంచుకుని తగిన మోతాదులో ఇవ్వాల్సి ఉండగా.. ఆ బాధ్యతను విస్మరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థిని వద్ద అన్ని టాబ్లెట్లు ఎలా ఉన్నాయి? ఆమెను తోటివారు వేధిస్తున్నా, ఎగతాళి చేస్తున్నా సిబ్బంది దృష్టికి ఎందుకు రాలేదు? తదితర అంశాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సమగ్ర విచారణ తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
🏠 Home