🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 22 September 2026, 10:05 pm Posted by : M TODAY NEWS

పాక్‌ మిత్రదేశానికి భారత్ బాసట

News Image
ముఖ్యమైన పాయింట్స్:పాక్‌ మిత్రదేశానికి భారత్ బాసటరష్యా డీజిల్‌కు బదులు భారత్ వైపు టర్కీ చూపుఆగస్టులో రికార్డు స్థాయిలో ఇంధన ఎగుమతులుకలిసొచ్చిన భారత రిఫైనింగ్ సామర్థ్యం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికలపై దాయాది దేశం పాకిస్థాన్‌కు వత్తాసు పలుకుతూ, తరచూ భారత్‌ను విమర్శించే టర్కీకి ఇప్పుడు ఇంధన కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు రష్యా నుంచి డీజిల్ సరఫరా నిలిచిపోవడం, మరోవైపు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో దిక్కుతోచని స్థితిలో పడిన టర్కీకి ఇప్పుడు భారతదేశమే శరణ్యమైంది. మిత్రదేశం పాకిస్థాన్ సైతం ఇంధన సంక్షోభంతో విలవిలలాడుతున్న వేళ.. టర్కీ తన అవసరాల కోసం గత్యంతరం లేక భారత్ వైపు మళ్లింది.

'క్ప్లర్' (Kpler) గణాంకాల ప్రకారం... 2026 ఆగస్టు నెలలో భారత్ నుంచి టర్కీకి ప్రతిరోజూ 1.20 లక్షల బ్యారెళ్లకు పైగా డీజిల్ ఎగుమతి అయింది. 2017 నుంచి చూసుకుంటే ఒకే నెలలో ఈ స్థాయిలో సరఫరా జరగడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో అమెరికా నుంచి సుమారు 90 వేల బ్యారెళ్లు టర్కీకి దిగుమతి అయ్యాయి. మరో ఇంధన విశ్లేషణ సంస్థ 'ఎనర్జీ ఆస్పెక్ట్స్' అంచనా ప్రకారం ఆగస్టులో సరఫరా రోజుకు 74 వేల బ్యారెళ్లుగా ఉన్నప్పటికీ, 2022 తర్వాత భారత్ నుంచి ఈ స్థాయి ఎగుమతులు జరగడం ఇదే అత్యధికం.

పడిపోయిన రష్యా వాటా..
చాలా కాలంగా టర్కీకి ప్రధాన డీజిల్ సరఫరాదారుగా రష్యా కొనసాగుతోంది. 2025లో టర్కీ డీజిల్ దిగుమతుల్లో రష్యా వాటా ఏకంగా 85 శాతంగా (రోజుకు 2.81 లక్షల బ్యారెళ్లు) ఉండేది. కానీ 2026 ఆగస్టు నాటికి పరిస్థితులు తలకిందులయ్యాయి. ఉక్రెయిన్ దాడులతో రష్యాలోని పలు రిఫైనరీలు దెబ్బతినడం, ఇంధన కొరతతో రష్యా తన ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో టర్కీకి డీజిల్ సరఫరా రోజుకు 80 వేల బ్యారెళ్లకు (20 శాతం) పడిపోయింది. దీనికి తోడు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధిలో నౌకాయానానికి అంతరాయాలు కూడా ఈ సంక్షోభాన్ని మరింత పెంచాయి.

కీలకంగా మారిన భారత రిఫైనరీలు
ప్రపంచవ్యాప్తంగా డీజిల్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో టర్కీ సహా పలు దేశాలు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నాయి. ఈ క్రమంలో భారీ రిఫైనింగ్ (ముడి చమురు శుద్ధి) సామర్థ్యం ఉన్న భారత్.. అంతర్జాతీయ మార్కెట్లో కీలక ఆటగాడిగా మారింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనరీలు ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2022 నుంచి రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తున్న భారత్.. దానిని దేశీయ రిఫైనరీల్లో శుద్ధి చేసి, అత్యుత్తమ డీజిల్, పెట్రోల్‌గా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. 'క్రిసిల్ ఇంటెలిజెన్స్' నివేదిక ప్రకారం, 2026 ఏప్రిల్-ఆగస్టు కాలంలో భారత పెట్రోలియం ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 46 శాతం మేర పెరిగాయి.
వ్యూహాత్మకంగా పాకిస్థాన్‌తో టర్కీకి బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ, ప్రస్తుత ప్రపంచ ఇంధన సంక్షోభ పరిస్థితుల్లో టర్కీకి భారత్ నుంచి డీజిల్ కొనుగోలు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.
🏠 Home