🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 24 September 2026, 10:08 pm Posted by : M TODAY NEWS

'ది ప్యారడైజ్'లో పొలిటికల్ ట్విస్ట్.. కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లిన 'కేసీఆర్' పాత్ర!

News Image
ముఖ్యమైన పాయింట్స్:హీరో రేవంత్, విలన్ కేసీఆర్ అంటూ కాంగ్రెస్ శ్రేణుల ముందస్తు హంగామాతెరపై కేసీఆర్‌ను పాజిటివ్‌గా చూపించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలసవారీ తెగకు అండగా ఎమ్మెల్యే (ప్రియదర్శి) పాత్ర.. ఫుల్ జోష్‌లో బీఆర్ఎస్
హైదరాబాద్: నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ప్యారడైజ్' చిత్రానికి తెలంగాణలో బలంగా రాజకీయ రంగు పులుముకుంది. సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు చేసిన హడావుడి, తీరా సినిమా చూశాక అనూహ్యంగా తారుమారవడంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను అత్యంత సానుకూలంగా, స్ఫూర్తిదాయకంగా చూపించడం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

ముందుగా కాంగ్రెస్ ఓన్ చేసుకునే యత్నం..

సినిమా విడుదలకు ముందు 'ది ప్యారడైజ్' కథను కాంగ్రెస్ కార్యకర్తలు తమకు అనుకూలంగా అన్వయించుకునే ప్రయత్నం చేశారు. చిత్రంలో నాని పోషించిన 'జడల్' పాత్రను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పోలుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. సినిమాలో విలన్లైన శిఖంజ మాలిక్‌ను కేసీఆర్‌గా, ఆయన కొడుకు విక్రమ్ మాలిక్‌ను కేటీఆర్‌గా అభివర్ణిస్తూ.. ఆ ఇద్దరినీ ఎదిరించి హీరోగా మారిన రేవంత్ రెడ్డే జడల్ అంటూ నెట్టింట కామెంట్ల హోరు సాగించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ వర్గాలు సినిమాను పూర్తిగా ఓన్ చేసుకునేందుకు అత్యుత్సాహం ప్రదర్శించాయి.

స్క్రీన్‌పై రివర్స్ అయిన సీన్..

సెప్టెంబర్ 23న రాత్రి జరిగిన ప్రీమియర్ షోలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెకండాఫ్‌లో కేసీఆర్‌ను పోలిన ఎమ్మెల్యే పాత్రలో నటుడు ప్రియదర్శి ఎంట్రీ ఇవ్వడంతో కథ కీలక మలుపు తిరిగింది. సికింద్రాబాద్ పరిసరాల్లోని 'సవారీ' కమ్యూనిటీ గుర్తింపు కోసం జరుగుతున్న అస్తిత్వ పోరాటానికి అండగా నిలిచే నాయకుడిగా కేసీఆర్ తరహా పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారు. ఆయుధాలు పట్టిన సవారీ తెగ యువకులను శాంతి మార్గంలో ప్రయాణించేలా ఉపదేశించడం, నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ను ఒప్పించి వారికి పౌరసత్వం దక్కేలా కృషి చేసిన ఎపిసోడ్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. కేసీఆర్ పాత్రను ఎలివేట్ చేసిన ఈ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఫుల్ జోష్‌లో గులాబీ దండు..

సినిమాలో కేసీఆర్ ఇమేజ్‌ను పాజిటివ్‌గా, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా చూపించడంతో బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తమ నాయకుడిని రియల్ హీరోగా చూపించారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు సినిమాను తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నించిన కాంగ్రెస్ వర్గాలు తాజా పరిణామాలతో నిరుత్సాహానికి గురయ్యాయి. తెరపై కేసీఆర్ పాత్రకు దక్కుతున్న అద్భుతమైన స్పందన రాజకీయంగా ఎలాంటి చర్చకు దారితీస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
🏠 Home