🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 24 September 2026, 10:53 pm Posted by : M TODAY NEWS

ఢిల్లీ నుంచే ఓట్ల గల్లంతు: ఈసీ తీరుపై 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' సంచలన కథనం

News Image
గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో ఓట్ల గల్లంతు, అవకతవకలు జరుగుతున్నాయని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' పత్రిక వరుస పరిశోధనాత్మక కథనాలను వెలువరిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం (ECI)లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, తోటి కమిషనర్లను సైతం లెక్కచేయడం లేదని గతంలో కథనం ప్రచురించిన ఆ పత్రిక, తాజాగా రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఢిల్లీ నుంచే ఐటీ సాఫ్ట్‌వేర్ ద్వారా ఓటర్ల జాబితాలో మార్పులు ఎలా జరిగిపోతున్నాయో ఆధారాలతో సహా బయటపెట్టింది. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, తోటి కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా కిందిస్థాయి అధికారుల అధికారాలను లాగేసుకుని ఈసీ ఐటీ విభాగం ఏకపక్షంగా ఎలా వ్యవహరించిందో గోవా ఉదంతం ద్వారా వివరించింది.

స్థానిక అధికారుల చేతులు కట్టేసిన 'ఈసీఐనెట్'

రాజ్యాంగం ప్రకారం ఓటర్ల జాబితాను రూపొందించడం, సవరణలు చేయడం స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల (ERO) ప్రాథమిక బాధ్యత. కానీ ఈసీ దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన 'ఈసీఐనెట్' (ECINet) అనే కొత్త క్లౌడ్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్ వల్ల ఈ అధికారాలన్నీ ఢిల్లీలోని ఐటీ విభాగానికి బదిలీ అయ్యాయి. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి, నిజానిజాలు నిర్ధారించి స్థానిక అధికారులు నిర్ణయాలు తీసుకున్నా, ఈ సాఫ్ట్‌వేర్ పరిమితుల వల్ల అవి నిరర్థకంగా మారుతున్నాయి. ఒకసారి ఈసీఐనెట్‌లో మార్పులు నమోదైతే వాటిని వెనక్కి తీసుకునే (రోల్‌బ్యాక్) సదుపాయం స్థానిక అధికారులకు లేకుండా చేశారు. పొరపాట్లను సరిదిద్దే కంట్రోల్ అంతా ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎస్డీఎం స్థాయి అధికారులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకుండా ఈసీఐ ఐటీ విభాగం ఎలా అడ్డుకుంటోందన్న దానిపై ఎన్నికల కమిషనర్లు జోషి, సంధూ గత కొద్ది నెలలుగా తమ నివేదికలలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలూ బేఖాతర్.. గోవాలో అసలేం జరిగింది?

ఓటర్ల జాబితాలో లాజికల్ వ్యత్యాసాల కారణంగా తొలగించిన ఓటర్లకు స్థానికంగా నోటీసులు ఇచ్చి, వారి పత్రాలను పునఃపరిశీలించాలని గత జనవరిలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తమిళనాడు పిటిషన్లపై ఇచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. దీనికి అనుగుణంగా గోవా ఎన్నికల ప్రధాన అధికారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. క్షేత్రస్థాయి విచారణలో 97 మంది దరఖాస్తుదారులు ఓటర్లుగా ఉండేందుకు పూర్తి అర్హులని నిర్ధారణ అయింది. గతంలో తప్పుగా తొలగించిన వీరి పేర్లను తుది జాబితాలో చేర్చాలని అధికారులు భావించారు. కానీ అందుకు అవసరమైన 'రోల్‌బ్యాక్' అనుమతులు, సాంకేతిక ఆధారాలు ఢిల్లీలోని ఈసీ ఐటీ విభాగం వద్ద ఉండటంతో స్థానికంగా ఏమీ చేయలేకపోయారు.

ఎనిమిది ఇమెయిల్స్.. అయినా చలించని ఢిల్లీ ఐటీ విభాగం

తుది ఓటర్ల జాబితా ప్రచురణకు కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో గోవా సీఈఓ సంజయ్ గోయల్.. ఢిల్లీలోని ఉన్నతాధికారులకు వరుసగా ఎనిమిది అత్యవసర ఇమెయిల్స్ పంపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ఆ 97 మంది అర్హులైన ఓటర్ల పేర్లను చేర్చేందుకు సాఫ్ట్‌వేర్‌లో రోల్‌బ్యాక్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలని పదేపదే కోరారు. దీనిపై స్పందించిన ఈసీ డిప్యూటీ కమిషనర్ సంజయ్ కుమార్.. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు ఐటీ విభాగం ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని, స్థానిక ఈఆర్‌ఓల నిర్ణయం మేరకు వెంటనే ఆ ఓటర్ల పేర్లను చేర్చాలని ఐటీ విభాగం డైరెక్టర్ జనరల్ సీమా ఖన్నాకు ఫిబ్రవరి 18న లేఖ రాశారు. తక్షణమే ఈ సాంకేతిక ప్రక్రియను పూర్తి చేయాలని ఇమెయిల్‌లో స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు ఇంత స్పష్టంగా ఆదేశించినా ఢిల్లీలోని ఈసీ ఐటీ విభాగం ఆ ఇమెయిల్స్‌ను పట్టించుకోలేదు. ఫలితంగా ఫిబ్రవరి 21న విడుదలైన తుది ఓటర్ల జాబితాలో అర్హులైన ఆ 97 మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి.
🏠 Home