🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 25 September 2026, 10:24 pm Posted by : M TODAY NEWS

కూటమిలో చీలిక లేదు.. ఒంటరి పోరు వార్తలపై జనసేన శ్రేణుల ఆగ్రహం

News Image
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలవుతున్న వేళ, రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా అధికార కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) మధ్య సీట్ల సర్దుబాటు, పొత్తులపై సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని, కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని జనసేన నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, వాస్తవాలకు విరుద్ధంగా తప్పుడు కథనాలు రాస్తున్న వారిపై మండిపడుతున్నారు.

గత ఐదేళ్ల పాలనలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ విపక్ష వైసీపీకి అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో కూటమి పక్షాలు బలంగా అడుగులు వేస్తున్నాయి. గతంలో చంద్రబాబు అరెస్టు, పవన్ కళ్యాణ్ పర్యటనలపై ఆంక్షలు వంటి సంఘటనలను కూటమి నేతలు ఇంకా మర్చిపోలేదు. ఈ నేపథ్యంలో ఎన్డీయే పక్షాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని వారు స్పష్టం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు చంద్రబాబు స్వయంగా వెళ్లి పరామర్శించడం వారి మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనమని పార్టీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. అలాగే, మంత్రి నారా లోకేష్ సైతం పవన్‌ను పదేపదే తన అన్నగా ప్రస్తావిస్తున్న విషయాన్ని వారు ఉదహరిస్తున్నారు.

ఇంతటి బలమైన బంధం కూటమి నేతల మధ్య కొనసాగుతుంటే, పవన్ కళ్యాణ్ టీడీపీ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని, బీజేపీకి దూరమవుతున్నారని ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. కూటమిలో భాగంగానే ఉంటూ, గెలుపు అవకాశాలు మెండుగా ఉన్న స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని, గెలిచే సీట్లను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇంత స్పష్టత ఇచ్చినప్పటికీ, కొందరు ఉద్దేశపూర్వకంగా కూటమిలో చిచ్చుపెట్టేలా కథనాలు రాయడాన్ని జనసేన వర్గాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి.
🏠 Home