🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 7:46 pm Posted by : M TODAY NEWS

సీఈసీ నియామకంపై జగన్ ట్వీట్.. మహువా మోయిత్రా స్ట్రాంగ్ కౌంటర్

News Image
ఎన్నికల కమిషన్ నిష్పాక్షికత, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఉండాలంటూ వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ట్వీట్‌పై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా తీవ్ర స్థాయిలో స్పందించారు.
సీఈసీ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వివాదాస్పద బిల్లును ప్రవేశపెట్టినప్పుడు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపిందని, ఇప్పుడు ఆదే పార్టీ అధినేత నీతులు చెప్పడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆమె విమర్శించారు. ముందుగా పార్లమెంట్‌లో బీజేపీకి మద్దతు ఇవ్వడం ఆపాలని, రాబోయే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియను వైఎస్సార్‌సీపీ ఎంపీలు వ్యతిరేకించేలా చూడాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో చప్పట్ల కోసం ఇలాంటి కపట నాటకాలు ఆడొద్దంటూ జగన్‌ను ఉద్దేశించి ఘాటుగా రిప్లై ఇచ్చారు. మహువా మోయిత్రా ఇచ్చిన ఈ కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ పరిణామంపై రాజకీయ వర్గాలు, నెటిజన్లు సైతం స్పందిస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు కేంద్రం తీసుకొచ్చిన పలు కీలక బిల్లులకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ.. ఇప్పుడు అధికారం కోల్పోగానే వైఖరి మార్చుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెండింగ్ కేసుల కారణంగానే జగన్ గతంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారని, ఇప్పుడు అకస్మాత్తుగా ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విపక్షాలు, నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఒక స్పష్టమైన రాజకీయ విధానం లేకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
🏠 Home