🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 7:55 am Posted by : M TODAY NEWS

అస్సాం ప్రభుత్వానికి 'సీజేపీ' సవాల్.. నేడు అస్సాంకు వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే!

News Image
తమ సభ్యుడు అశుతోష్ రాంకాను అస్సాం పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తీవ్ర స్థాయిలో మండిపడింది. రాంకాను అరెస్టు చేసి గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఈ పరిణామాలతో అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వానికి సీజేపీ బహిరంగంగా సవాల్ విసురుతోంది.

పోలీసులు అశుతోష్‌ను ఇంకా విడుదల చేయకపోవడంతో తాను అస్సాం వెళ్తున్నట్లు అభిజిత్ దీప్కే 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. ''అరెస్టులు, జైలు బెదిరింపులకు మేము తలొగ్గే ప్రసక్తే లేదు. విమానాశ్రయంలో నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు నిరభ్యంతరంగా ముందుకు రావచ్చు'' అంటూ సవాల్ విసిరారు. హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ''మాతో పెట్టుకోవద్దు'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు, పార్టీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ కూడా అస్సాం వెళ్లేందుకు సిద్ధమైనప్పటికీ.. ఆయన డెంగ్యూ బారిన పడటంతో పర్యటన విరమించుకున్నారు. కాగా, సోమవారం అస్సాం చేరుకోనున్న అభిజిత్ దీప్కేను కూడా విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
🏠 Home