🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 9:14 pm Posted by : M TODAY NEWS

హవాలా అనుమానాలు.. నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆఫీస్‌లో ఐటీ సోదాలు

News Image
ముంబై: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్‌ కార్యాలయంపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిధుల మళ్లింపు, అక్రమ లావాదేవీలు జరిగాయన్న బలమైన అనుమానాల నేపథ్యంలో ముంబైలోని ఆమె కార్యాలయంతో పాటు మరికొందరు నటుల ఆఫీసుల్లోనూ ఐటీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి.
సినిమా ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తున్నామనే ముసుగులో భారీ ఎత్తున నగదును హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు.. కార్యాలయాల్లోని కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, విదేశాలకు జరిగినట్లుగా భావిస్తున్న నగదు బదిలీల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

గతంలో డ్రగ్స్ కేసులో సోదరుడి పేరు..

ఇదిలా ఉండగా, గత ఏడాది డిసెంబర్‌లో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ కేసులో వెలుగులోకి రావడం అప్పట్లో కలకలం రేపింది. 2025 డిసెంబర్ 19న 'ఈగల్' (EAGLE) టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు డ్రగ్స్ వ్యాపారులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ పెడ్లర్ల నుంచి అమన్ ఐదుసార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అప్పట్లో దర్యాప్తులో తేలింది. ఆ వివాదం మరువకముందే, ఇప్పుడు ఏకంగా రకుల్ ఆఫీస్‌లో ఐటీ సోదాలు జరగడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
🏠 Home