🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 29 September 2026, 11:22 pm Posted by : M TODAY NEWS

శంషాబాద్‌ నుంచి తాష్కెంట్‌కు నేరుగా విమాన సర్వీసులు..

News Image
దక్షిణ భారతదేశాన్ని మధ్య ఆసియాతో కలుపుతూ తొలిసారిగా నేరుగా విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌కు ‘సెంట్రమ్ ఎయిర్’ సంస్థ మంగళవారం తమ తొలి సర్వీసును లాంఛనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీహెచ్ఐఏఎల్, సెంట్రమ్ ఎయిర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ డైరెక్ట్ విమాన సర్వీసులు వారానికి రెండుసార్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి సోమవారం, గురువారం రాత్రి 9:30 గంటలకు తాష్కెంట్‌లో బయలుదేరే విమానం మరుసటి రోజు తెల్లవారుజామున 2:20 గంటలకు శంషాబాద్ చేరుకుంటుంది. తిరిగి ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో తెల్లవారుజామున 3:35 గంటలకు శంషాబాద్‌లో బయలుదేరి ఉదయం 7:45 గంటలకు తాష్కెంట్ చేరుకుంటుంది.

ఈ కొత్త సర్వీసుల ప్రారంభంపై జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సీఈఓ కధీర్ కధీరవన్ హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ మార్కెట్లకు నేరుగా కనెక్టివిటీ కల్పించడం ఎంతో అవసరమని, ఈ కొత్త మార్గం ద్వారా ఇరు ప్రాంతాల మధ్య వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు బలపడటమే కాకుండా హైదరాబాద్‌కు మెడికల్ టూరిజం వృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌తో పాటు దక్షిణ భారతదేశాన్ని ప్రపంచంలోని కీలక గమ్యస్థానాలతో అనుసంధానించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అలాగే, సెంట్రమ్ ఎయిర్ నెట్‌వర్క్ విస్తరణలో తాము సన్నిహితంగా భాగస్వాములమయ్యామని ఏరోప్రైమ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ అభిషేక్ గోయల్ పేర్కొన్నారు.

కాగా, కొత్తగా తాష్కెంట్‌ను గమ్యస్థానంగా చేర్చుకోవడంతో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ప్రయాణించే అంతర్జాతీయ నగరాల సంఖ్య 27కు చేరింది. దేశీయంగా 74 గమ్యస్థానాలకు ఇక్కడి నుంచి ఇప్పటికే కనెక్టివిటీ కొనసాగుతోంది. ఈ సరికొత్త మార్గంతో దక్షిణ భారత ప్రయాణికులకు, వ్యాపార వర్గాలకు మధ్య ఆసియాతో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
🏠 Home