🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 9:52 pm Posted by : M TODAY NEWS

బిఆర్‌ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గుడ్‌‌బై: సన్నాహక సమావేశంలో తీవ్ర అవమానం!

News Image
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ (BRS Party) రాజకీయంలో తీవ్ర కలకలం రేగింది. పార్టీ సన్నాహక సమావేశంలో తనకు జరిగిన ఘోర అవమానానికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) సన్నాహక సమావేశానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో తన పేరును కనీసం ముద్రించకపోవడం, వేదికపైకి కూడా ఆహ్వానించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

రాజీనామా అనంతరం తాటి వెంకటేశ్వర్లు 'దిశ' ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ తన ఆవేదనను, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనకు రాజకీయాల్లో 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉందని, 1999 నుంచే ఎమ్మెల్యేగా పనిచేశానని గుర్తుచేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ ఇలాంటి అవమానకర పరిస్థితులు ఎదుర్కోలేదన్నారు.
సన్నాహక సమావేశంలో సీనియర్ నాయకుడైన తనకు కనీస గౌరవం ఇవ్వకపోవడంపై ప్రశ్నించినందుకు, తన వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తల ముందే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ అత్యంత దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. 'పార్టీలో ఉంటే ఉండండి.. పోతే పోండి' అంటూ వ్యాపారవేత్తలైన ఆ నాయకులు అహంకారంతో మాట్లాడారని, పర్సంటేజీల కోసం పనిచేసే వారి వల్లే పార్టీ భ్రష్టుపడుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇలాంటి నాయకులు అవమానిస్తుంటే ఆత్మగౌరవాన్ని చంపుకుని కొనసాగలేనని స్పష్టం చేశారు.

భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే స్పష్టత

తాటి వెంకటేశ్వర్లు రాజీనామా (Tati Venkateswarlu Resignation) వార్త ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రెండు మూడు రోజుల్లో తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రెస్ మీట్ ద్వారా ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.

తాటి వెంకటేశ్వర్లు 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా బూర్గంపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, 2014లో అశ్వారావుపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్) లో చేరిన ఆయన, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పార్టీలో గుర్తింపు దక్కడం లేదని 2022 జూన్‌లో కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, 2023 ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో తిరిగి కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ గూటికి చేరారు. తాజాగా మరోసారి పార్టీకి రాజీనామా చేయడంతో రాబోయే రోజుల్లో ఆయన ఏ దారి ఎంచుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
🏠 Home