Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

గణేష్ నిమజ్జనంలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువకుడి మృతి

Author
Posted By M TODAY NEWS
| 20 Sep 2026, 03:19 PM | TELANGANA
గణేష్ నిమజ్జనంలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువకుడి మృతి

ముఖ్యమైన పాయింట్స్:

  • డ్యాన్స్ చేసి ఇంటి మెట్లపై కూర్చుండగానే ప్రాణాలు వదిలిన వైనం
  • కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
  • గతేడాది వివాహ వేడుకలో గుండెపోటుతోనే అన్న మృతి
  • నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్)లో ఘటన

నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఓ యువకుడు గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. కళ్లముందే భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సింగారపు బాలయ్య అలియాస్ రాము (34) తమ వీధిలో ఏర్పాటు చేసిన గణేశుని నిమజ్జన ఊరేగింపులో స్నేహితులతో కలిసి పాల్గొన్నాడు. విగ్రహం ముందు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ అలసిపోయాడు. ఊరేగింపు తన ఇంటి వద్దకు చేరుకోగానే.. ఆయాసంతో ఇంటి ముందున్న మెట్లపై కూర్చున్నాడు. అదే సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

భర్త కిందపడిపోవడాన్ని గమనించిన భార్య రోజా కేకలు వేయడంతో.. స్నేహితులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాలయ్యకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. హుటాహుటిన హాలియాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పండుగ పూట యువకుడు మరణించడంతో స్నేహితులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

అన్నదమ్ములిద్దరికీ ఒకే పరిస్థితి..

ఇవి కూడా చదవండి

బాలయ్య కుటుంబంలో ఇది రెండో విషాదం. గత ఏడాది జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న బాలయ్య అన్న సింగారపు వెంకటేశం కూడా ఇదే తరహాలో గుండెపోటుతో మరణించాడు. వరుసగా అన్నదమ్ములిద్దరూ గుండెపోటుతో చిన్న వయసులోనే మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.