Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

విజయసాయి ‘వాయిస్’పై వైసీపీ విషప్రచారం.. సొంత నేత పత్రికపై ఎందుకంత భయం?

Author
Posted By M TODAY NEWS
| 21 Sep 2026, 10:55 PM | ANDHRA PRADESH
విజయసాయి ‘వాయిస్’పై వైసీపీ విషప్రచారం.. సొంత నేత పత్రికపై ఎందుకంత భయం?

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యవహారశైలి ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సజ్జల తనపై దాడులకు సైతం దిగారని విజయసాయిరెడ్డి బహిరంగంగా ఆరోపించడం కలకలం రేపింది. అక్కడితో ఆగకుండా తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న ఆరోపణలు వైసీపీ నాయకత్వానికి ఏమాత్రం మింగుడుపడటం లేదు.
గతంలోనే తాను సొంతంగా ఒక మీడియా సంస్థను స్థాపిస్తానని, ఆ వ్యవహారాలను తన కుమార్తె చూసుకుంటారని విజయసాయిరెడ్డి ప్రకటించారు. న్యూస్ ఛానల్‌తో పాటు దినపత్రికను కూడా ఏర్పాటు చేస్తానని వెల్లడించిన ఆయన.. ఆ దిశగా అడుగులు వేగవంతం చేశారు. తాజాగా 'వాయిస్' అనే పేరుతో ఆయన ఒక పత్రికను ప్రారంభించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా అందుబాటులోకి రాగా, ప్రస్తుతం ఇది పీడీఎఫ్ రూపంలో వార్తలను అందిస్తోంది. అయితే, ఈ పత్రిక ఇంకా పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లకముందే వైసీపీ అనుకూల మీడియా, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగాలు దీనిపై తీవ్రస్థాయిలో విషం చిమ్మడం ప్రారంభించాయి. ఆదిలోనే విజయసాయిరెడ్డి పత్రికను దెబ్బతీయాలనే లక్ష్యంతో ముప్పేట దాడికి, నెగిటివ్ ప్రచారానికి దిగాయి.
వాస్తవానికి తన పత్రిక, ఛానల్ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాయని, ఏ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయబోవని విజయసాయిరెడ్డి ముందుగానే స్పష్టం చేశారు. ఆయన క్షేత్రస్థాయిలో బలమున్న మాస్ లీడర్ కాదు. ఎప్పుడూ తెరవెనుక ఉంటూ జగన్‌కు సలహాలు, వ్యూహాలు అందించిన నాయకుడు. నెల్లూరు జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు పెద్దగా ప్రజాబలం లేదు. అలాంటప్పుడు ఆయనొక పత్రిక పెడితే వైసీపీ ఎందుకు అంతలా భయపడుతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పత్రికకు కాషాయం రంగు అద్దారని, బీజేపీకి భజన చేస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తుండటం, తనను తాను బాల్ థాకరేతో పోల్చుకున్న విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పిస్తుండటం వెనుక ఆంతర్యం ఏమిటన్నది చర్చకు దారితీస్తోంది. వైసీపీ నేతల భయాన్ని, వారి సోషల్ మీడియా గ్రూపుల్లో జరుగుతున్న చర్చలను చూస్తుంటే వ్యవహారంలో ఏదో మర్మం దాగి ఉందని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
ఇటీవల వరుస విలేకరుల సమావేశాలు నిర్వహించి మరీ వైసీపీ నాయకత్వంపై విజయసాయిరెడ్డి మత మార్పిడుల ఆరోపణలు చేయడం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. ఒకప్పుడు పార్టీలో నంబర్ టూ హోదాలో ఉన్న నాయకుడు ఇప్పుడు అదే పార్టీ విధానాలపై తీవ్ర విమర్శలు చేయడం, దానికి ప్రతిగా వైసీపీ శ్రేణులు ఆయన పత్రికపై మూకుమ్మడి దాడికి దిగడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్థాయిలో తనపై, తన నూతన పత్రికపై జరుగుతున్న కుట్రపూరిత ప్రచారంపై భవిష్యత్తులో విజయసాయిరెడ్డి ఏ విధంగా స్పందిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.