Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

Author
Posted By M TODAY NEWS
| 24 Sep 2026, 10:34 PM | ఆధ్యాత్మికత
తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

ముఖ్యమైన పాయింట్స్:

  • ఈ ఏడాది 20 శాతం మేర పెరగనున్న భక్తుల రద్దీ
  • అధికారుల సమీక్షలో టీటీడీ జేఈవో శరత్ వెల్లడి
  • పంచమి తీర్థం రోజున 4 హోల్డింగ్ పాయింట్ల ఏర్పాటు

తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు టీటీడీ యంత్రాంగం సమాయత్తమవుతోంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలకు గత ఏడాదితో పోలిస్తే ఈసారి 15 నుంచి 20 శాతం వరకు భక్తులు అదనంగా వచ్చే అవకాశం ఉందని టీటీడీ జేఈవో శరత్ అంచనా వేశారు. రద్దీకి అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈవో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన పంచమి తీర్థం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అందుకోసం పటిష్టమైన క్యూలైన్లు, బ్యారికేడ్లతో పాటు భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రధానంగా 4 హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు అన్ని ముఖ్యమైన ప్రవేశ మార్గాల వద్ద ఎల్ఈడీ స్క్రీన్లు, సూచిక బోర్డులు, అవసరమైన చోట్ల ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అలాగే, ఆలయ పవిత్రతను, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఆలయ పరిసరాలు, మాడ వీధులు, ప్రధాన రహదారుల్లో ప్రత్యేక కాన్సెప్ట్‌తో ఆకర్షణీయమైన విద్యుద్దీపాలంకరణలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ వెలుగుల్లో అమ్మవారి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

మరోవైపు భక్తుల ఆరోగ్యానికి, భద్రతకు పెద్దపీట వేయాలని జేఈవో ఆదేశించారు. భక్తుల కోసం అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వైద్య సిబ్బంది, మందులు, అత్యవసర వైద్య సేవలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని వైద్య శాఖను కోరారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత కోసం ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, క్యూలైన్లు, మాడ వీధుల్లో నిరంతర పర్యవేక్షణ ఉండేలా పోలీసు, నిఘా వర్గాలు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. అమ్మవారి కృపతో బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించేలా ప్రశాంత వాతావరణంలో జరగాలని, ఇందుకోసం ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని జేఈవో సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో టీటీడీ సీఈ మనోహరం, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, డీఎఫ్‌వో డి.ఫణికుమార్ నాయుడు, ఎస్‌ఈ వేంకటేశ్వర్లు, వీజీవో గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి