Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

భారత బ్యాటర్ల విధ్వంసం.. ఆసీస్‌పై సంచలన విజయంతో సిరీస్‌ కైవసం

Author
Posted By M TODAY NEWS
| 25 Sep 2026, 10:57 PM | Sports
భారత బ్యాటర్ల విధ్వంసం.. ఆసీస్‌పై సంచలన విజయంతో సిరీస్‌ కైవసం

ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో ఇండియా-ఎ మహిళల జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆసీస్ నిర్దేశించిన 363 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు అలవోకగా ఛేదించి రికార్డు సృష్టించారు. కష్టసాధ్యమనుకున్న టార్గెట్‌ను కేవలం 48.2 ఓవర్లలోనే 6 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి సగర్వంగా తలెత్తుకున్నారు. ఈ చారిత్రక విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుని సత్తా చాటింది. బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నా.. బ్యాటర్లు సమిష్టిగా కదం తొక్కి అద్భుత విజయాన్ని అందించారు.

భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా మిన్నూ మాని కేవలం 56 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 88 పరుగులు సాధించి అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. మిన్నూ మానీ విద్వంసానికి తోడుగా నిక్కీ ప్రసాద్ (76), కెప్టెన్ అనుష్క శర్మ (58), తనీషా సింగ్ (60) అర్ధశతకాలతో రెచ్చిపోయారు. ఏకంగా నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు సాధించి, కీలక సమయాల్లో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పడంతో భారత్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆసీస్ బౌలర్లలో చార్లీ నాట్‌, లిల్లీ మిల్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టినా భారత బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయారు.
అంతకుముందు తొలిగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 362 భారీ పరుగులు సాధించింది. ఆసీస్ బ్యాటర్ చార్లీ నాట్ కేవలం 70 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 109 పరుగులు చేసి సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. కౌర్ట్నీ వెబ్ (92 బంతుల్లో 95) తృటిలో శతకం చేజార్చుకుంది. వీరిద్దరి ధాటికి ఒక దశలో ఆసీస్ స్కోరు బోర్డు ఉప్పెనలా పరుగులు పెట్టింది. అయితే భారత బౌలర్లు వైష్ణవి శర్మ, నిక్కీ ప్రసాద్‌ అద్భుతంగా పుంజుకుని చెరో 4 వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు. అటు బంతితో పాటు ఇటు బ్యాట్‌తోనూ అదరగొట్టిన నిక్కీ ప్రసాద్ ఈ అపూర్వ విజయంలో కీలక పాత్ర పోషించింది.