Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

మేము చమురు అమ్మకపోతే.. ప్రాంతంలో ఎవరినీ అమ్మనివ్వం!

Author
Posted By M TODAY NEWS
| 29 Sep 2026, 11:33 PM | INTERNATIONAL, అంతర్జాతీయం
మేము చమురు అమ్మకపోతే.. ప్రాంతంలో ఎవరినీ అమ్మనివ్వం!

ముఖ్యమైన పాయింట్స్:

  • అమెరికాకు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘలీబాఫ్ తీవ్ర హెచ్చరిక
  • - 1980ల నాటి వ్యూహాలతోనే అగ్రరాజ్యాన్ని ఎదుర్కొంటామని స్పష్టీకరణ
  • - ఒకవైపు వార్నింగ్‌లు.. మరోవైపు ఖతార్‌లో ఇరు దేశాల రహస్య చర్చలు
  • - ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో తమ భద్రతకు విఘాతం కలిగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ అగ్రరాజ్యం అమెరికాను హెచ్చరించింది. తమ చమురు ఎగుమతులను అడ్డుకుంటే, ఆ ప్రాంతంలోని ఏ ఒక్క మౌలిక సదుపాయం కూడా సురక్షితంగా ఉండబోదని స్పష్టం చేసింది. "మేము చమురు అమ్మలేని పరిస్థితి వస్తే.. ఈ ప్రాంతం నుంచి మరెవ్వరినీ చమురు అమ్మనివ్వబోం" అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘలీబాఫ్ అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా 1980 నాటి ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కీలకమైన అబాదాన్ ముట్టడిని ఘలీబాఫ్ గుర్తుచేశారు. ఆనాడు సద్దాం హుస్సేన్ దళాలు అబాదాన్ నగర రవాణా మార్గాలను మూసివేసి, చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేసి నగరాన్ని ఆక్రమించాలని చూశాయన్నారు. అయితే, ఇరాన్ ప్రజలు, విప్లవ యోధులు తమ దృఢ సంకల్పంతో ఏడాది పాటు సాగిన ఆ ముట్టడిని కేవలం 48 గంటల్లోనే ఛేదించారని ఆయన వివరించారు. ఇప్పుడు అమెరికా కూడా అదే తరహాలో నౌకాదళ దిగ్బంధం, వైమానిక కారిడార్ల మూసివేతతో తమపై ఆర్థిక ఒత్తిడి పెంచాలని చూస్తోందని ఘలీబాఫ్ మండిపడ్డారు. 1980ల నాటి సైనిక వ్యూహాలతోనే అమెరికా కుట్రలను తిప్పికొడతామని, తమపై ఎలాంటి దాడి జరిగినా సత్వరమే, కచ్చితంగా, అత్యంత బాధాకరమైన రీతిలో బదులిస్తామని ఆయన తేల్చిచెప్పారు.

ఓవైపు ఇరాన్ నుంచి తీవ్రస్థాయిలో హెచ్చరికలు వస్తుండగా, మరోవైపు తెరవెనుక దౌత్య ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఖతార్ వేదికగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీకి, అమెరికా ప్రతినిధులకు మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. అణు కార్యక్రమంపై ఇరాన్ స్పష్టమైన హామీలు ఇస్తేనే ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన నిధుల విడుదలకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా వర్గాలు చెబుతున్నాయి. అమెరికా తరఫున స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. "వాళ్లు మాతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నారు. కానీ అది మేం కోరుకుంటున్న ఒప్పందం కాదు. వాళ్లు పరిస్థితులను ఏమాత్రం మెరుగుపరుచుకోలేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అణు కార్యక్రమాల సడలింపుపై ఇరు దేశాలు సుముఖత వ్యక్తం చేస్తున్నప్పటికీ, నిబంధనలు, అమలు గడువు తదితర అంశాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రస్తుతం అమెరికా అధికారిక స్పందన కోసం టెహ్రాన్ వేచిచూస్తోందని దౌత్య వర్గాలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి